అనితర సాధ్యుడు... నరేంద్రుడు

ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పేరు పొన్నూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా, రాష్ట్రం అంతటా ప్రజలకు, తెలుగు దేశం అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు.

తెలుగు వారి ఆత్మ గౌరవం పేద ప్రజలే దేవుళ్ళు ... సమాజమే దేవాయలం అని నినదించిన ఎన్టీర్ సిద్ధాoతాలకు అసలైన వారసుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనుంగ అనుచరుడిగా ధూళిపాళ్ళ రాష్ట్ర రాజకీయాల్లో సుస్ధిర స్థానం సంపాదించకున్నారు.

ఉన్నత విద్యావంతుడిగా సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవ చేయాలని నరేంద్రకుమార్ తలిస్తే విధి మరోలా ఆలోచించింది. తండ్రి స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి అకాల మరణంతో పెద్ద దిక్కు కోల్పోయిన పొన్నూరుకు నేను అండగా ఉంటానంటూ ప్రజల కోరికపై రాజకీయ అరంగేట్రం చేసిన నరేంద్ర కుమార్ రాజకీయ జీవితం అప్రతిహతంగా కొనసాగుతుంది. రాజకీయ ఉద్దండులకు నెలవైన పొన్నూరు ఆ ప్రముఖులకే సాధ్యం కాని విధంగా పొన్నూరు కోటపై టిడిపి పసుపు జెండాను వరుసగా ఐదు పర్యాయాలు ఎగురవేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు నరేంద్ర కుమార్. 

ప్రజా సమస్యలపై గత 25 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల హృదయాల్లో చెరుగని ముద్రను వేసుకున్నారు. అన్యులకు సాధ్యం కాని వరుస విజయాలతో నరేంద్ర కుమార్ 6వ పర్యాయం రికార్డ్ విజయం దిశగా ముందుకు సాగిపోతున్నారు.

కుటుంబ నేపద్యం:-

పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో మాజీ మంత్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి, ప్రమీలా దేవి దంపతులకు మొదటి సంతానంగా 1967 డిసెంబర్ 14వ తేదీన నరేంద్ర కుమార్ జన్మించారు. 1969 జనవరి 10 న సోదరుడు రవికుమార్, 1970లో సోదరి రాధిక జన్మించారు. నరేంద్ర కుమార్ ప్రాధమిక విద్యాభ్యాసం 1 నుంచి 6 వ తరగతి వరకు స్వగ్రామం చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూలులో సాగింది. 7, 8, 9 తరగతులు నిడుబ్రోలు జిల్లా పరిషత్ హై స్కూలులో,10వ తరగతి అనంతవరప్పాడులో చదివారు. ఇంటర్మీడియట్ విద్యను విజయవాడ లయోలా కళాశాలలో అభ్యసించారు. ఇంజనీరింగ్ విద్యను కర్ణాటక రాష్ట్రంలోని చిత్ర దుర్గ కళాశాలలో మైసూర్ యూనివర్శిటి ద్వారా పూర్తి చేశారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులు కోరిక మీదట కలెక్టరు అయి ప్రజలకు సేవ చేయాలని 1989లో హైదరాబాద్ లోని రావుస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్కు ప్రిపైర్ అయ్యారు. మరి కొద్ది రోజుల్లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉన్న తరుణంలో తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఆకస్మిక మరణంతో అనివార్య పరిస్థితుల నేపధ్యంలో నరేంద్రకుమార్ రాజకీయ  రంగ ప్రవేశం చేసి వెనుదిరిగి చూడకుండా అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్నారు.

1992వ సంవత్సరంలో జ్యోతిర్మయిని నరేంద్రకుమార్ పరిణయమాడారు. వీరికి వీర వైష్ణవి, నాగ సాయి వైదీప్తి అనే కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ నేపద్యం :-

సమర్దులే ఎప్పుడూ నాయకత్వం వహిస్తారు... అందరికీ మార్గదర్శకులవుతారు... చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడూ మాటలు చెప్పడు... చేతులతో చేసి చూపెడతాడు... ఒక్కడిగా వస్తాడు... ప్రజల గుండెల్లో నిలుస్తాడు... చరిత్ర సృష్టించే తిరతాడు అన్న మహనీయుల  మాటలను నిజం చేస్తూ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ రాజకీయ జీవితం చారిత్రాత్మకంగా సాగుతుంది. 1994 జనవరి 24న టిడిపి తలపెట్టిన రైతు సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అకాల మరణం పొందిన మాజీ మంత్రి ధూళిపాళ్ళ వారసుడిగా నరేంద్ర కుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

తండ్రి వదిలి వెళ్ళిన అశేష ప్రజాభిమానంతో 1994 ఫిబ్రవరి 16న సంగం డేయిరి ఛైర్మన్ పదవితో తొలిసారిగా నరేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వేను వెంటనే 1994 మే 16న జరిగిన శాసన సభ ఎన్నికల్లో స్వపక్షంలోనే పలువురితో పోరాటం సాగించి పొన్నూరు టిడిపి అభ్యర్ధిత్వాన్ని సాధించారు. ప్రజలు అఖండ మేజార్టితో అసెంబ్లీలో ఎమ్మేల్యేగా నరేంద్ర కుమార్ అడుగు పెట్టారు. అచిరకాలంలోనే తండ్రి వారసత్వం ముద్రను అధిగమించి తనదైన వాణిబాణితో పొన్నూరుతో పాటు సంగం డేయిరిని ప్రగతి బాట పట్టించారు. స్వపక్షం, విపక్షం నుంచి వచ్చిన ఎన్నో సవాళ్ళను అధిగమించి పరిణితి కలిగిన రాజకీయ నాయకుడిగా నరేంద్ర కుమార్ తనను తాను తీర్చిదిద్దుకున్నారు.

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువ అవడం ద్వారా అందరివాడు అయ్యాడు. దాదాపు రెండు లక్షలు ఉన్న నియోజకవర్గ ప్రజలను పేరుతో పలకరించేoత అరుదైన జ్ఞాపక శక్తి నరేంద్ర కుమార్ సొంతం. నియోజకవర్గంలో కుల, మత, విద్వేషాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో పొన్నూరు కోట పూర్తిగా ధూళిపాళ్ళ వశమైoదనే చెప్పాలి. పొన్నూరు టిడిపికి కంచు కోటగా మార్చిన నరేంద్ర కుమార్ అన్యులకు సాధ్యంకాని విధంగా విజయాలు సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో తలపడిన ప్రత్యర్ధులను ధూళిపాలు చేసిన ఘనత ధూళిపాళ్ళకే దక్కింది. 1994 నుంచి 1999, 2004, 2009, 2014లో వరుసు విజయాలతో నరేంద్ర కుమార్ అనితర సాధ్యుడిగా మారాడు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మిన బంటుగా అధినేత అప్పగించిన పనులను చక్కబెట్టడంలో నేర్పరిగా మారారు. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఎదురుగాలిలో సైతం నరేంద్ర కుమార్ పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో టిడిపికి ఒకే ఒక్కడిగా నిలిచారు. పార్టీ కష్ట కాలంలో కీలక పదవులను అధిష్టించి పార్టీని ముందుండి నడిపిన ధీశాలి నరేంద్ర. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ విప్ గా సమర్ధవంతమైన సేవలను అందించారు. చేపట్టిన పదవులకే వన్నె తెచ్చేలా వ్యవహరించారు. ప్రజలు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న నరేంద్ర కుమార్ కు అండగా నిలిచి వరుసగా ఐదు పర్యాయాలు అఖండ విజయాన్ని చేకూర్చారు.

 

శాసనసభ్యునిగా విజయాలు :-

1994 - తలశిల వెంకట్రామయ్య (కాంగ్రెస్)పై 21,729 ఓట్ల మెజార్టీ

1999  - చిట్టినేని ప్రతాప్ కుమార్ (కాంగ్రెస్)పై 15,53౩ ఓట్ల మెజార్టీ

2004  - మన్నవ రాజకిషోర్ (కాంగ్రెస్)పై 9,025 ఓట్ల మెజార్టీ

2009  -  మారుపూడి లీలాధరరావు (కాంగ్రెస్)పై 2,168 ఓట్ల మెజార్టీ

2014  -  రావి వెంకటరమణ (వైసిపి) పై 7,761 ఓట్ల మెజార్టీ 

 

సంగం ప్రగతి రధ సారధిగా ధూళిపాళ్ళ:-

జిల్లాలో పాడి పరిశ్రమలో క్షీర విప్లవాన్ని సృష్టించిన తండ్రి ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి వారసుడిగా సంగం డెయిరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర కుమార్ అచిరకాలంలోనే డెయిరిని జిల్లాలోనే కాకుండా దక్షిణ భారత దేశంలో ప్రధమ స్థానంలో నిలిపారు. 1994 ఫిబ్రవరి 16న తొలిసారిగా చైర్మన్ హోదాలో డెయిరీలో అడుగు పెట్టి రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించారు. వేను వెంటనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో 8 నెలల స్వల్ప కాలంలోనే సంగం బాధ్యతలను వదులుకొని మరొకరికి అవకాశం కల్పించారు. అనంతర కాలంలో  డెయిరీ వైపు చూడకపోవడంతో పాల ఉత్పత్తి దారుల్లో తీవ్ర స్దాయులో ఆందోళన నెలకొంది. పాల రైతుల ఒత్తిడి మేరకు 2010 సెప్టెంబర్ 23న తిరిగి సంగం డెయిరీ చైర్మన్ గా నరేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు పాల ఉత్పత్తి దారుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

అనేక సమస్యలతో సతమతమవుతున్న పాడి రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందడుగు వేశారు. రెండవ సారి బాధ్యతలు స్వికరించన సమయంలో పాడి రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. పాలు కూడా వినియోగదారులకు డిమాండ్ మేరకు ఉత్పత్తి, సేకరణ కాకపోవడంతో పాల ఉత్పత్తి వైపు నరేంద్ర కుమార్ దృష్టి సారించారు. ౩౦ నుంచి 35 రూపాయల వరకు ఉన్న లీటర్ పాల ధరను పలు దఫాలుగా పెంచి ఇప్పటికి  లీటర్ రూ. 58 చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాలో  వీరయ్య చౌదరి స్దాపించన పాల సొసైటీలను బలోపేతం చేయడంపై ఆధిక శ్రద్ధ కనబరిచారు. 375 పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు, 354 మిల్క్ కలెక్షన్ సెంటర్లు, 1262 వెండార్ పాయింట్లను పటిష్టం చేయడంతో పాల ఉత్పత్తి సేకరణ అవసరాల మేరకు పెరిగింది.

నాడు వేలల్లో ఉన్న పాల ఉత్పత్తి దారుల నరేంద్ర కుమార్ కృషితో నేడు జిల్లాలో సంగం డెయిరీ ప్లాంట్లను విస్తరించడంతో పాటు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పలు పాల ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. వినియోగదారుల కోరిక మేరకు కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి పాల సేకరణతో పాటు మార్కెట్ ను విస్తరించారు. ప్రస్తుతం రూ. 5౦౦ కోట్ల టర్నోవరుతో సంగం డెయిరీ ప్రగతి పధంలో దూసుకుపోతుంది.

ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి రూరల్ ఎకనమికల్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నరేంద్ర కుమార్ నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడల అభివృద్ది ప్రజలకు ఉచిత వైద్యం అందజేస్తున్నారు.